ప్ర) ఈ సూత్రాలు ఏమిటి?
స)పరలోక భూలోకములకును, దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
ఆయన అన్ని లోకములకన్న ముందు, తన తండ్రినుండి జన్మించినవాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైనదేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించినవాడును, తండ్రితో ఏకత్వము గలవాడునైయున్నాడు.
సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును, మన రక్షణ కొరకును, పరలోకమునుండి దిగివచ్చి, పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారియై, మనుష్యుడాయెను. ఆయన మనకొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను.
ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి, పరలోకమునకెక్కి, తండ్రి కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. ఆయన సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు మహిమతో తిరిగివచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను.
ఆయన ప్రభువును, జీవమిచ్చువాడును, తండ్రి నుండియు కుమారునినుండియు, బయలుదేరువాడును, తండ్రితోను, కుమారునితోను కూడ ఆరాధింపబడి, మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునై యున్నాడు.
మరియు సార్వత్రికమును, అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాపవిమోచనము కొరకైన ఒక్కటే బాప్తీస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్ధానము కొరకును, రాబోవు యుగము యొక్క జీవము కొరకును ఎదురుచూచుచున్నాను. ఆమేన్.